|
|  |
దక్షిణాఫ్రికా ఆతిథ్యమిస్తున్న ట్వంటీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో భారత-పాకిస్థాన్ లు నేడు జోహాన్స్ బర్గ్ లో తలపడనున్నాయి. శనివారం రాత్రి ముగిసిన రెండో సెమీఫైనల్లో ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియాను 15 పరుగుల తేడాతో మట్టికరిపించి భారత్ ఫైనల్లోకి ప్రవేశించింది. భారత జట్టు సమిష్టిగా కృషిచేసి కంగారూలను హడలెత్తించారు. ఎప్పుడూ ప్రత్యర్ధి జట్టును కంగారెత్తించే ఆసీస్ కు ఈసారి మాత్రం భారత్ చేతిలో ఎదురు దెబ తగిలింది. తొలుత టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ కు దిగి 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది.భారత మిడిలార్డర్ బ్యాట్స్ మెన్ యువరాజ్ సింగ్ దూకుడు ముందు ఆసీస్ జట్టు చేష్టలుడిగుపోయింది. యువరాజ్ సింగ్ 30 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లు సాయంతో 70 పరుగులు చేశాడు. మరోవైపు ధోనీ (36), ఊతప్ప (34) పరుగులు చేసి యువరాజ్ సింగ్‌కు తోడ్పాటునందించారు. ఊతప్ప-యువరాజ్ సింగ్ లు మూడో వికెట్ కు 84 పరుగులు భాగస్వామ్యాన్ని 6.3 ఓవర్లలో అందించారు. ఆసీస్ బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్ తో బౌలింగ్ చేసినప్పటికీ భారత బ్యాట్స్ మెన్లను కట్టడిచేయలేకపోయారు.
|
|