|
|  |
హైదరాబాద్ : భారత్- ఆస్ట్రేలియా జట్ల ఏడు మ్యాచ్‌ల ఫ్యూచర్ కప్ వన్డే సిరీస్ ను చూసి తరించాలని చూస్తున్న భారత క్రికెట్ అభిమానుల ఉత్సాహం పై వరుణ దేవుడు నీళ్లు చల్లుతున్నాడు. సిరీస్‌లో భాగంగా బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొలివన్డే వర్షం దెబ్బతో ఒక ఇనింగ్స్ ముగిసి రెండో ఇన్నంగ్స్ 9 ఓవర్ల ఆట మాత్రమే జరిగిన తరువాత రద్దైన సంగతి తెలిసిందే. ఇప్పుడు కొచ్చిలో మంగళవారం జరిగే రెండోవన్డే, ఈ నెల 5న హైదరాబాద్ లో జరుగబోయే మూడో వన్డేలకు కూడా అదే గతిపట్టే అవకాశాలు లేకపోలేదు. రుతుపవనాలు దక్షిణభారతదేశంలో చురుకుగా ఉండడంతో కర్నాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో జోరుగా వర్షాలు పడుతున్నాయి. ఈ నేప్థ్యంలో సిరీస్ జరుగుతున్న కారణంగా మ్యాచ్ మ్యాచ్ కూ వరుణుడు వెంటాడే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే కేరళ క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో జరిగే రెండో వన్డే మ్యాచ్‌ను సైతం వరుణ దేవుడు వెంటాడుతూనే ఉన్నాడు. డే-మ్యాచ్ గా జరిగే ఈ పోటీ కోసం కొచ్చీలోని నెహ్రూ స్టేడయంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. టిక్కెట్లన్నీ ఇప్పటికే హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. హైదరాబాద్‌లో జరిగే మూడో వండేకు సైతం మంగళవారం నుంచి టికెట్లు విక్రయించనున్నారు. ఈ మ్యాచ్‌కు సైతం వరుణ భయం ఉంది. అయితే అభిమానులు మాత్రం టికెట్ల వేటలో పడిపోయారు. 39 వే సీటింగ్ కెపాసిటీ ఉన్న రాజీవ్ గాంధి ఇంటర్నేషనల్ స్టేడియంలో 15 వేల టికెట్లు మాత్రమే అభిమానుల కోసం జంటనగరాలలోని యుకో బ్యాంకు శాఖల ద్వారా విక్రయించడానికి ఏర్పాటు చేశారు.వర్షం లేకుండా మ్యాచ్ జరిగితే అందరికీ ఆనందమే అయితే వర్షంతో మ్యాచ్‌కు అంతరాయం కలుగెతే, రద్దయితే నష్టం మాత్రం వెర్రి అభిమానులకే.
|
|