|
|
 |
వడోదరాలో జరిగిన ఫ్యూచర్ కప్ ఐదో వన్డేలో భారత్ 9 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై పరాజయం పాలైంది. భారత్ నిర్ణయించిన 149 పరుగుల విజయలక్ష్యన్ని ఆసీస్ 25.5 ఓవర్లలో ఓ వికెట్ కోల్పోయి చేధించింది. ఆసిస్ విజయంలో బౌలర్ జాన్సన్, ఓపెనర్ గిల్‌క్రిస్ట్ కీలకపాత్ర పోషించారు. స్వల్ప విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియాపై ప్రారంభంలోనే భారత్ స్పిన్నర్లను ప్రయోగించింది. మంచి ఫామ్‌లో ఉన్న హేడెన్ (29) వికెట్‌ను మాత్రమే భారత్ దక్కించుకోగలింగింది. కెప్టెన్ పాంటింగ్ (39)తో కలసి గిల్‌క్రిస్ట్ (79) అర్థ సెంచరీతో ఆస్ట్రేలియాను విజయతీరాలకు చేర్చాడు. దీంతో ఆస్ట్రేలియా సిరీస్‌లో 3-1 ఆధిక్యత సాధించింది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఒక్క మ్యాచ్ విజయం సాధిస్తే సిరీస్ ఆస్ట్రేలియా వశం అవుతుంది. భారత్‌కు మాత్రం సిరీస్ కోల్పోకుండా ఉండడానికి మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో పోరాడాల్సి ఉంది. అర్థ సెంచరీతో ఆస్ట్రేలియాకు సునాయస విజయాన్ని అందించిన కీపర్ గిల్‌క్రిస్ట్ ఈ మ్యాచ్‌లో ఏకంగా ఆరుగురు భారత బ్యాట్స్‌మెన్ క్యాచ్‌లు అందుకున్నాడు. అంతేకాకుండా మరో బ్యాట్స్‌మెన్ రనౌట్‌లో కూడా పాలుపంచుకున్నాడు. అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌ను ఆస్ట్రేలియా బౌలర్ జాన్సన్ చావుదెబ్బ తీశాడు.కేవలం 10 ఓవర్ల లో 26 పరుగులిచ్చి 5 వికేట్లు తీసుకున్నాడు . మొత్తం ఐదు వికెట్లు పడగొట్టిన జాన్సన్ భారత్‌ను తక్కువ పరుగులకే కట్టడి చేయడంలో కీలకపాత్ర పోషించాడు. ఇంతకుముందు మరే ఇతర ఆస్ట్రేలియా బౌలర్ భారత్‌లో ఈ స్థాయి ప్రదర్శన కనబర్చలేదు. 400 వన్డే ఆడుతున్న సచిన్ (47) ఒక్కడే ఆస్ట్రేలియా బౌలర్లను కాసేపు ప్రతిఘటించాడు. పఠాన్, జహీర్‌ఖాన్ నిలదొక్కుకునే ప్రయత్నం చేసి విఫలం అయ్యారు. పూర్తిగా ఆస్ట్రేలియా బౌలర్లు పైచేయి సాధించిన ఈ మ్యాచ్‌లో బౌలర్ల చలవతో 150 పరుగులైనా చేరుకుంది. సీనియర్ బ్యాట్స్‌మెన్ గంగూలీ, ద్రావిడ్ డకౌట్ అయ్యారు. ఆస్ట్రేలియా ఇచ్చిన ఎక్స్‌ట్రాలు కూడా భారత్ ఈ మాత్రం స్కోరు చేయడానికి ఉపయోగపడ్డాయి. 5 వికెట్లు తీసుకుని భారత్ పరాజయానికి కారణమైన జాన్సన్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.సిరీస్‌లో మిగిలిన ఆరో వన్డే నాగ్‌పూర్‌లో, ఏడో వన్డే ముంబయిలో జరగనుంది.
|
|