|
|
 |
హైదరాబాద్: తమ పార్టీ అధినేత కె. చంద్రశేఖర రావుపై చేసిన వ్యక్తిగత విమర్శలకు గాను క్షమాపణ చెప్పే వరకు రోజాను తెలంగాణ జిల్లాల్లో తిరగనివ్వబోమని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు నాయని నర్సింహారెడ్డి చెప్పారు. చంద్రశేఖరరావుపై రోజా వ్యక్తిగత వ్యాఖ్యలకు నిరసనగా తెరాస కార్యకర్తలు శనివారంనాడు తెలంగాణ జిల్లాల్లో ఆందోళనకు దిగారు. నాయని నర్సింహారెడ్డి నాయకత్వంలో హైదరాబాదులోని ఆర్టీసి క్రాస్ రోడ్డులో తెరాస కార్యకర్తలు రాస్తారోకోకు దిగారు. రోజా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా నాయని నర్సింహారెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. చంద్రశేఖరరావును తిట్టే స్థాయి రోజాకు లేదని ఆయన అన్నారు. తెలంగాణను, తెరాస నాయకులను అవమానిస్తే సహించబోమని ఆయన అన్నారు. రోజాది ఆంధ్రా అహంకార ధోరణి అని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడును తాము వ్యక్తిగతంగా ఎప్పుడూ కించపరచలేదని ఆయన స్పష్టం చేశారు. రోజాకు క్యారెక్టర్ లేదని, ఆమెతో గొడవ ఎందుకని తమతో చాలా మంది అంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తాము మహిళ అనే ఉద్దేశంతో రోజాకు గౌరవం ఇచ్చామని ఆయన అన్నారు. తాము రోజాను ప్రత్యక్షంగా క్యారెక్టర్ లేదని ఎప్పుడూ అనలేదని, తమతో చాలా మంది ఆ విషయం చెబుతున్నారని ఆయన అన్నారు.
|
|