|
రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఇందిరమ్మ పథకం ద్వారా అర్హులైన వారందరికీ ఇళ్లు మంజూరు చేయాలని సీపీఎం డిమాండ్ చేసింది. ఈ గృహనిర్మాణ పథకం అనర్హులకు కాకుండా ఇళ్లు లేని పేదవారికి ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని రాష్ట్రప్రభుత్వాన్ని కోరింది.హైదరాబాద్‌లో మంగళవారం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు ఈ మేరకు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు లేఖ రాశారు. వివిధ పథకాల కింద లబ్దిదారులకిచ్చే రుణాలు సరిపోవట్లేదన్నారు. రుణాల కంటే అలాంటి వారికి ఉపాధి కల్పించడం ఎంతో ఉత్తమమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.భారీ స్థాయిలో నిర్వహిస్తున్న ఇందిరమ్మ పథకంపై ప్రభుత్వ ప్రత్యేక దృష్టిని సారించాలన్నారు. అలాగే దారిద్ర్యరేఖకు దిగువ స్థాయిలో ఉన్న ప్రతి కుటుంబానికి ఈ పథకం ద్వారా లబ్ది చేకూరేలా చర్యలు తీసుకోవాలని రాఘవులు కోరారు. ఇలా చేసే బాధ్యత పూర్తిగా ప్రభుత్వానిదేనని రాఘవులు తెలిపారు.
|