|
|  |
పాకిస్థాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ జారీ చేసిన జాతీయ సఖ్యత (రాజకీయ సద్దుబాటు) ఆర్డినెన్స్ కు చుక్కెదురయింది. పాక్ సుప్రీంకోర్టులోనూ, లాహోర్ హైకోర్టులోనూ దీన్ని వాలుచేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి. మాజీ ప్రధాని బేనజీర్ భుట్టోపైన, ప్రభుత్వ పదవులు నిర్వహించిన ఇతరులపైన కోర్టుల్లో నడుస్తున్న అవినీతి కేసులకు స్వస్తి చెపుతూ వారితో అధికార పంపకానికి వీలుకల్పించే ఈ ఆర్డినెన్స్ , దురుద్దేశంతో కూడుకున్నదని తారిక్ అజీజ్ అనే అడ్వకేట్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన వారికి ఈ ఆర్డినెన్స్ రక్షణ కల్పిస్తున్నందున, దీన్ని నిలిపి వేయాలని ఆయన కోరారు. కేవలం ప్రభుత్వ పదవులు నిర్వహించే వారిపై ఉండే కేసులను మాత్రమే ఎత్తివేయడానికి వీలిచ్చే ఈ ఆర్డినెన్స్ , పక్షపాతంతో కూడుకున్నదని, దేశ పౌరులకు రాజ్యాంగంలోని 25 అధికరణం కల్పిస్తున్న సమానావకాశాల హక్కుకు ఇది పూర్తిగా భంగకరమని తారిక్ పేర్కొన్నారు. అసలీ ఆర్డినెన్సే రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ నస్రుల్లా బాబర్ అనే లాయర్ లాహోర్ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఏ ఆర్డినెన్స్ అయినా జాతీయ ప్రయోజనాల దష్ట్యా జారీ చేయాల్సి ఉండగా, దీన్ని మాత్రం ఓ రాజకీ పార్టీతో మంతనాలనంతరం తీసుకు వచ్చారని, కనుక ఇది చెల్లదని ఆయన పేర్కొన్నారు.
|
|