|
|  |
వచ్చే ఏడాది లోకసభకు మధ్యంతర ఎన్నికలు తప్పవని భారతీయ జనతా పార్టీ (బిజెపి) సీనియర్ నాయకుడు ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడంలో విఫలమైందని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. కాంగ్రెస్, వామపక్షాలు పరస్పరం తప్పులను మోపుకుంటున్నారని, ఇది అస్థిరత్వానికి దారి తీసి ప్రభుత్వం కూలిపోతుందని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో రామసేతు అంశమే తమ ఎన్నికల ఎజెండా అని ఆయన అన్నారు. తమకు రామసేతును చర్చనీయాంశంగా చేయడం ఇష్టం లేదని, అయితే ప్రభుత్వం దేశ ప్రజల మనోభావాలను దెబ్బ తీసే విధంగా వ్యవహరించిందని, ఇందుకు ప్రధాని మన్మోహన్ సింగ్ గానీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ గానీ క్షమాపణ చెప్పలేదని ఆయన అన్నారు. రాముడి వివాదంలో ఏ కేంద్ర మంత్రిపై కూడా చర్యలు తీసుకోలేదని ఆయన విమర్శించారు. డిఎంకె నేత, తమిళనాడు ముఖ్యమంత్రి రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, కరుణానిధిని కేంద్ర ప్రభుత్వం కట్టడి చేయలేకపోయిందని ఆయన విమర్శించారు. రాముడు ఈ దేశ అస్తిత్వానికి ప్రతీక అని ఆయన అన్నారు.
|
|