|
|
 |
పాకిస్ధాన్‌లో ఎమర్జెన్సీ విధించడానికి ప్రయత్నిస్తే అట్టి చర్యలను తాము ప్రతిఘటిస్తామని మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో పేర్కొన్నారు. ప్రస్తుత పాక్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌కు కోర్టులో ప్రతికూలమైన తీర్పు వచ్చిన నేపథ్యంలో ఆయన దేశంలో ఎమర్జెన్సీ విధించేందుకు సాహసించవచ్చని ఆమె అన్నారు. కరాచీలోని తన నివాసంలో జరిగిన పార్టీ నేతల సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎమర్జెన్సీ లాంటి నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుంటే తమ పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ చూస్తూ ఊరుకోదని ఆమె అన్నారు. ముషరఫ్‌కు వ్యతిరేకంగా కోర్టులో ఉన్న కేసులో తీర్పు వచ్చే వరకు భుట్టో దుబాయిలోని తమ కుటుంబ సభ్యులతో గడపాడానికి వెళ్ళనున్నారని వార్తలు వచ్చాయి. కానీ ఆ ప్రయాణాన్ని రద్దు చేసుకున్న ముషరఫ్ అభ్యర్థిత్వంపై కోర్టులో ఉన్న కేసులో కోర్టు తీర్పుకోసం పాక్ ప్రజలతో పాటు తాము కూడా ఎదురు చూస్తున్నామని ఆమె అన్నారు. కోర్టు ఇచ్చే ఎలాంటి తీర్పునైనా తమ ఇష్టాయిష్టాలకతీతంగా అన్ని పార్టీలు కట్టుబడి ఉండాలని ఆమె కోరారు. ప్రజలు ప్రజాస్వామ్యాన్ని, అబివృద్ధిని కోరుకుంటున్నారని పేర్కొన్నారు.
|
|