|
|
|
పాకిస్థాన్ ప్రభుత్వం దేశంలో అత్యవసర పరిస్థితిని విధించారు. దేశంలో నానాటికి పెరిగిపోతున్న తీవ్రవాదుల హింసాయుత కార్యకలాపాలు, రాజకీయ అనిశ్చితి అత్యవసర పరిస్థితి విధింపుకు హేతువుగా మారాయని రాజకీయ నిపుణులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా ప్రైవేట్ టీవీ ఛానెళ్ళు ప్రసారాలను నిలిపివేసాయి. పార్లమెంట్ వద్ద భారీ ఎత్తున సైనిక బలగాలను మోహరింప చేశారు. పెషావర్‌లోని కీలకప్రాంతాలలో సైనిక పికెట్లను ఏర్పాటు చేసారు. పాకిస్థాన్ దేశాధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్, ప్రధాని షౌకత్ అజీజ్, పాక్ ఇంటలిజెన్స్ విభాగపు ఛీఫ్ తదితరులు అత్యవసర పరిస్థితి విధింపుపై కీలకసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొవిజనల్ రాజ్యాంగబద్ధమైన ఆదేశాలను జారీ చేశారు. పాకిస్థాన్ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇఫ్తికార్ చౌదరిని సైనిక దళాలు సుప్రీం కోర్టు నుంచి తరలించాయి. దీంతో 1999 నాటి పరిస్థితి పునరావృతం అయ్యింది. ఈ సందర్భంగా పాకిస్థాన్ ముస్లింలీగ్ వైస్ ప్రెసిడెంట్ ఖలేద్ మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం అత్యవసర పరిస్థితి అవసరం లేదని అన్నారు. అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా అన్ని రాజకీయ పక్షాలను కూడగడతామని పాక్ మాజీ ప్రధాని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) అధినేత్రి బెనజీర్ భుట్టో తెలిపారు. తాజా పరిస్థితి కారణంగా దేశంలోని పేదప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూరదని ఆమె అన్నారు. ఇదిలా ఉండగా పాకిస్థాన్ కాలమానాన్ని అనుసరించి కేంద్రమంత్రి వర్గం సాయంత్రం గం. 7:30లకు సమావేశం కానున్నది. ఇస్లామాబాద్‌లో భద్రతను పెంచారు. పాక్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ టెలివిజన్ ద్వారా జాతిని ఉద్దేశించి శనివారం రాత్రి ప్రసంగించే అవకాశం ఉంది. 1500 మంది రిజర్వ్ భద్రత దళాలను ఇస్లామాబాద్‌కు పిలిపించారు. అత్యవసర పరిస్థితి విధింపుపై బెనజీర్ భుట్టోకు ముందుగానే సమాచారం అందిందని డాన్ న్యూస్ పేర్కొంది. అత్యవసర పరిస్థితి విధింపు పేరిట సైనిక పాలనను చేపట్టవలసిందిగా అమెరికా పాలకులు పాకిస్థాన్ ప్రభుత్వానికి సూచించినట్లు డాన్ న్యూస్ ఊటంకించింది.
|
|