|
|
|
దేశ ప్రయోజనార్ధం అత్యవసర పరిస్థితిని విధించాల్సి వచ్చిందని పాకిస్థాన్ సర్వ సైన్యాధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ ప్రకటించారు. ఎమర్జెన్సీని విధించని పక్షంలో దేశానికి అది ఆత్మహత్యాసదృశ్యమవుతుందని ముషారఫ్ పాక్ ప్రజలకు వివరణ ఇచ్చుకున్నారు. తీవ్రవాదం, చొరబాటుతనం ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతోపాటు ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించే రీతిలో పాలనలో న్యాయవ్యవస్థ జోక్యంతో ఎమర్జెన్సీ విధించినట్లు ముషారఫ్ పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ రాజ్యాంగ ఆదేశానుసారం దేశంలో అత్యవసర పరిస్థితిని విధించిన అనంతరం భారత కాలమాన ప్రకారం శనివారం రాత్రి గం. 11:30 ని.లకు అధికారిక టీవీ ఛానల్ ద్వారా పాకిస్థాన్ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఆయన మాటల్లో న్యాయవ్యవస్థ, మీడియా వ్యవస్థల పనితీరు పట్ల తీవ్ర నిరసన వ్యక్తమయ్యింది. తన నేతృత్వంలో పాకిస్థాన్‌లో ప్రజాస్వామ్య స్థాపన కోసం మూడెంచల కార్యక్రమాన్ని చేపట్టినట్లు ముషారఫ్ వెల్లడించారు. 1999 సంవత్సరంలో అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్‌ను పదవీచ్యుతుని గావించడం ద్వారా తొలి దశ ప్రజాస్వామ్య వ్యవస్థను 2002 వరకు సాగించినట్లు తెలిపారు. 2002 నుంచి 2007 సంవత్సరం నవంబర్ 2వ తేదీ వరకు రెండవ దశను చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణలో మూడవ దశగా ప్రస్తుతం ఎమర్జెన్సీ విధించక తప్పలేదని ముషారఫ్ తన చర్యను సమర్ధించుకున్నారు.
|
|