|
|  |
నియంతృత్వ పోకడలను కొనసాగిస్తున్న మియన్మార్ సైనిక ప్రభుత్వంపై ఆంక్షలు విధించే దిశగా అమెరికా సిద్ధమవుతోంది. ఆసియా దేశమైన మియన్మార్ ను ప్రజాస్వామ్యం దిశగా నడిపించేందుకు ఈ చర్యలు తప్పవని వైట్ హౌస్ తెలిపింది.ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశంలో ప్రసంగించనున్న అమెరికా అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ.బుష్, మియన్మార్ సహా ఆ దేశానికి ఆర్థికంగా సహకరిస్తున్న వారిపైనా ఆంక్షలను ప్రకటిస్తారని బుష్ జాతీయ భద్రతా సలహాదారు స్టీఫెన్ హాడ్లీ తెలిపారు. మియన్మార్ సైనిక ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆసియాలోని ప్రముఖ దేశాలైన చైనా మరియు భారత్ లతో చర్చలు జరపాలని అమెరికాకు విజ్ఞప్తులు కూడా వెళ్లాయి. మరోవైపు మియన్మార్ సార్వభౌమాధికారాన్ని గౌరవిస్తామని భారత్ పేర్కొనడం తగదని, హింసాత్మక ధోరణిని అవలంబిస్తున్న మియన్మార్ తో భారత్ సంబంధాలను కొనసాగించడం దురదృష్టకరమని బ్రిటిష్ కన్సర్వేటివ్ పార్టీ ఎంపీ జాన్ బర్ కో విమర్శించారు. మియన్మార్ ప్రభుత్వం మానవ హక్కులను కాలరాయడంతో పాటు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తోందని ఆయన దుయ్యబట్టారు. ఆదేశానికి చెందిన ప్రజాస్వామ్యవాది ఆంగ్ సాంగ్ సూకీ ఏళ్ల తరబడి గృహ నిర్బంధంలో ఉన్న సంగతి తెలిసిందే
|
|