|
పాకిస్థాన్‌లో ప్రతిపక్షానికి చెందిన 235 మందికిపైగా శాసనసభ్యులు ఆదివారం రాజీనామా చేశారు. ప్రతిపక్ష ఆల్ పార్టీస్ డెమొక్రటిక్ మూమెంట్ (ఏపీడీఎం) శాసనసభ్యులందరూ వారివారి పార్టీల నేతలకు రాజీనామా లేఖలు అందజేశారని పాకిస్థాన్ ముస్లిం లీగ్- నవాజ్ సీనియర్ నేత రాజా జఫారుల్ హక్ తెలిపారు. ప్రస్తుతం రాజీనామా చేసిన వారిలో 84 మంది జాతీయ అసెంబ్లీ సభ్యులు కూడా ఉన్నారు. నాలుగు ప్రాంతీయ అసెంబ్లీలకు చెందిన మరో 150 మంది శాసనసభ్యులు కూడా రాజీనామా చేశారని రాజా తెలిపారు. పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్‌కు చెందిన పీఎంఎల్- ఎన్ నేతృత్వంలోని ఏపీడీపీ ఆ దేశంలో త్వరలో జరగబోతున్న అధ్యక్ష ఎన్నికల్లో ముషారఫ్ పోటీ చేయడాన్ని వ్యతిరేకిస్తుంది. ఎన్నికల్లో ముషారఫ్ పోటీ చేస్తే తమ కూటమి సభ్యులందరూ రాజీనామా చేస్తారని ఇంతకుముందే పీఎంఎల్- ఎన్ హెచ్చరించింది. ప్రస్తుతం రాజీనామా చేసిన సభ్యులందరి రాజీనామా లేఖలను పీఎంఎల్ అక్టోబర్ రెండో తేదీన ఆయా అసెంబ్లీల స్పీకర్లకు అందజేయనుంది.
|