|
|  |
ప్రపంచంలోనే అత్యున్నత పురస్కారంగా భావించే బహుమతుల్లో నోబెల్ ది ప్రధమ స్ధానం. అందులోనూ మానవాళి శాంతి కోసం కృషి చేసినవారికి ఇచ్చే శాంతి బహుమతి అంటే ప్రత్యేక గౌరవం. ఈ తరుణంలో నోబెల్ శాంతి బహుమతిపై ప్రత్యేక కధనం మీ కొసం.. స్వీడెన్ పారిశ్రామికవేత్త "ఆల్ఫ్రెడ్ నోబెల్" తన వీలునామాలో ప్రకటించిన ఐదు నోబెల్ పురస్కారాల్లో శాంతి బహుమతి ఒకటి. 1896లోనే అల్ఫ్రెడ్ మరణించినప్పటికీ, 1901 నుంచి ఈ పురస్కారాలను ఇవ్వడం ప్రారంభించారు. విధ్వంసాన్ని సృష్టించే డైనమైట్ ను కనిపెట్టినందుకు పరిహారంగా ఈ బహుమతులను ఇవ్వాల్సిందిగా నోబెల్ తన వీలునామాలో పేర్కొన్నాడనేది విమర్శకుల అభిప్రాయం. 1901 నుంచి భౌతిక, రసాయన, వైద్య శాస్త్రం, సాహిత్యం, శాంతి కోసం విశేషంగా కృషి చేసినవారికి ఈ పురస్కారాలను అందజేస్తున్నారు. 1969 నుంచి ఆర్ధిక శాస్త్రంలోనూ నోబెల్ ను ఇవ్వడం మొదలుపెట్టారు. రాయల్ స్వీడిష్ అకాడమీ శాంతి బహుమతి మినహా మిగతా అవార్డులను అందజేస్తుంది. శాంతి పురస్కారం కోసం ప్రత్యేకంగా నార్వే ఓ కమిటీని నియనిస్తుంది. వాళ్లే విజేతకు బహుమతిని అందజేస్తారు. మొదటిసారి ఈ పురస్కారాన్ని 1901 లో స్విడ్జర్లాండ్ కు చెందిన సంఘ సంస్కర్త హెన్రీ డ్యునాంట్ అందుకున్నారు. రెడ్ క్రాస్ స్దాపనకు స్ఫూర్తిగా నిలిచినందుకు హెన్రీ ఈ అవార్డును పొందారు. ఇప్పటివరకూ 94 మంది వ్యక్తులు, 19 సంస్ధలకు ఈ గౌరవం దక్కింది. ప్రపంచంలో అత్యున్నత పురస్కారంగా భావించే నోబెల్ బహుమతిపై కొన్ని అపవాదులు కూడా ఉన్నాయి. అడాల్ఫ్ హిట్లర్, బెన్నిటో ముస్సోలినీ, స్టాలిన్ ఈ శాంతి గౌరవానికి నామినేట్ అయ్యి సంచలనం సృష్టించారు. వీరిలో హిట్లర్ పేరు 1930 లో పరిశీలకు వచ్చింది. అంతేకాకుండా, భారత జాతిపిత మహాత్మాగాంధీ ఐదు సార్లు ఈ బహుమతికి నామినేట్ అయినా, ఒక్కసారి కూడా ఈ పురస్కారాన్ని అందుకోలేకపోయారు. దేశాల మధ్య శాంతికోసం కృషి చేసిన వారికి, సైన్యాల తగ్గింపునకు పాటుపడినవారికి లేదా, శాంతిని ప్రచారం చేసినవారికి బహుమతి దక్కాలనేది ఆల్ఫ్రెడ్ నోబెల్ అభిప్రాయం.
|
|