|
|  |
ఇస్లామాబాద్ లో లాల్ మసీదును తిరిగి తెరిచేందుకు పాకిస్థాన్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. మసీదులో ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతించాలని పాక్ సుప్రీంకోర్టు ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేయడంతో ప్రస్తుతం అధికారులు ఆ పని మీద ఉన్నారు. దాదాపుగా లాల్ మసీదును తెరిచేందుకు సన్నాహాలన్నీ పూర్తయ్యాయి. మరో కొన్ని గంటల్లో మసీదును తెరుస్తామని పాక్ అధికారులు తెలిపారు. జూలై నెలలో లాల్ మసీదులో తీవ్రవాదులు తలదాచుకోవడంతో మసీదుపై పాక్ ప్రభుత్వం సైనిక చర్యకు దిగింది. ఆపరేషన్ సైలెన్స్ పేరుతో పాక్ ప్రభుత్వం చేపట్టిన సైనిక చర్యలో సుమారు 100 మంది మరణించారు. తీవ్రవాదులతో సైనికులు జరిపిన పోరులో మసీదు కూడా కొంతవరకు దెబ్బతింది. పాకిస్థాన్ సుప్రీంకోర్టు మంగళవారం లాల్ మసీదులో ప్రార్థనలు చేసుకోవడానికి అనుమతించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాకుండా మసీదులో సైనిక చర్య వలన దెబ్బతిన్న భాగాలను పునర్నిర్మించాలని ఉత్తర్వులు జారీ చేసింది. మౌలానా అబ్దుల్ ఘఫర్ ను తాత్కాలిక మతపెద్దగా, ఆమీర్ సిద్ధిఖీని అతని నాయిబ్ గా నియమించాలని ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
|
|