|
|
అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంటున్న పాకిస్థాన్‌లో పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. రెండోసారి బహిష్కృతులైన ప్రధాన న్యాయమూర్తి ఇఫ్తికార్ చౌదరి స్థానంలో అబ్దుల్ హమిద్ డాగర్ నియమితులయ్యారు. ఇఫ్తికార్‌ను అదుపులోకి తీసుకున్న పాక్ సైన్యం, హైకోర్టు న్యాయమూర్తులను సైతం అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. పాక్ పాలనా వ్యవహారాల్లో న్యాయవ్యవస్థ అతిగా జోక్యం చేసుకోవడం కూడా అత్యవసర పరిస్థితికి ఓ కారణమని ముషారఫ్ ప్రభుత్వం జారీ చేసిన ప్రొవెన్షియల్ రాజ్యాంగ ఉత్తర్వులో పేర్కొనడం గమనార్హం. ఇదిలా ఉండగా, పాకిస్థాన్‌లో ప్రతిపక్ష నేతలపై కూడా సైన్యం బలప్రయోగం చేసి వారిని అదుపులోకి తీసుకుంది. మరోవైపు పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ అధినేత్రి బెనజీర్ భుట్టో దుబాయ్ నుంచి పాకిస్థాన్‌కు బయలుదేరినట్లు ఆమె భర్త అసిఫ్ జర్దారీ ధృవీకరించారంటూ వార్తలు వచ్చాయి. మరోపక్క దేశంలోకి ప్రయివేటు విమానాలు రాకుండా ముషారఫ్ ప్రభుత్వం తాజాగా నియంత్రణలు విధించినట్లు తెలిసింది. పాకిస్థాన్‌లో న్యాయవ్యవస్థ కుప్పకూలగా, ప్రొవెన్షియల్ ప్రభుత్వాలు మాత్రం కొనసాగుతున్నాయి. ముషారఫ్‌కు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య శక్తులు కలిసిరావాలని బెనజీర్ సహా అన్ని వర్గాలకూ పాక్ మాజీ ప్రధాని నవాజ్ సౌదీ నుంచి పిలుపునిచ్చారు. పాకిస్థాన్ పరిణామాలపై అమెరికా విదేశాంగ కార్యదర్శి కండొలిజ్జా రైస్ స్పందిస్తూ ఇది విచారకరమని పేర్కొన్నారు. ముందుగా ప్రకటించిన మేరకు జనవరి నెలలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ దిశగా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగాలని అమెరికా కోరుకుంటోందన్నారు.
|
|