|
|
|
ఎల్టీటిఈ రాజకీయ విభాగం అధిపతి తమిళ్‌సెల్వన్ మృతి పట్ల తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి సంతాపం ప్రకటించారు. కిలినోచ్చి వద్ద జరిగిన శ్రీలంక వైమానిక దాడుల్లో తమిళ్ సెల్వన్ మరణించిన సంగతి తెలిసిందే. డీఎంకే అధినేత అయిన కరుణానిధి తన సంతాపాన్ని కవితారూపంలో వ్యక్తం చేశారు. "శత్రువులకు చిరునవ్వుతో ఎదురేగే వ్యక్తిత్వం నీ సొంతమని, చిరు ప్రాయంలోనే హిమాలయమంతటి శక్తి కలిగి, బాలసింగంచే (ఎల్టీటిఈ దివంగత ప్రముఖుడు) మలచబడిన తమిళ్‌సెల్వన్ .... నువ్వెక్కడికెళ్లావని" కరుణ తన కవితలో ప్రశ్నించారు. కేంద్రంలోని కాంగ్రెస్ సంకీర్ణంలో భాగమైన డీఎంకే అధినేత కరుణానిధి, కాంగ్రెస్ నేత రాజీవ్ గాంధీని పొట్టనబెట్టుకున్న ఎల్టీటిఈ నాయకుని మృతిపై ఈ స్థాయిలో స్పందించడం పట్ల రాజకీయ వర్గాలు సహా సర్వత్రా భిన్న వ్యాఖ్యలకు దారి తీసింది.
|
|