బాబూని అవమానించిన వైఎస్ ?
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం

 

 నువ్వెంత, నీ బతుకెంత, నోర్ముయ్ అని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడిపై వ్యాఖ్యానించారు. శాసనసభ సలహా, సంప్రదింపుల కమిటీ (బిఎసి) సమావేశంలో స్పీకర్ కె.ఆర్. సురేష్ రెడ్డి సమక్షంలో ఆయన సోమవారం ఆ వ్యాఖ్యలు చేశారు. దాంతో ఆగ్రహించిన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు సమావేశం నుంచి వాకౌట్ చేశారు. సమావేశంలో జరిగిన వ్యవహారాన్ని చంద్రబాబు మీడియా ప్రతినిధుల సమావేశంలో వివరించారు. ప్రజా సమస్యలపై చర్చించడానికి శాసనసభా సమావేశాలను మరో మూడు రోజులు పొడిగించాలని చంద్రబాబు కోరారు. దాంతో ముఖ్యమంత్రి దండం పెడుతూ మీరు చెప్పండి, మీరు చెప్పినట్లే సభను నడిపిస్తాం అని వ్యంగ్యంగా పదే పదే అన్నట్లు చంద్రబాబు తెలిపారు. తాము చెప్పినట్లు నడపాల్సిన అవసరం లేదని, అధికార పార్టీగా మీ బాధ్యతను మీరు నిర్వర్తించండి, ప్రతిపక్షంగా మా బాధ్యతను మేం నిర్వర్తిస్తామని చెప్పానని, దాంతో ముఖ్యమంత్రి హుందాతనాన్ని మరిచిపోయి తనను దుర్భాషలాడారని ఆయన వివరించారు. నీ జీవితమెంత, నీ బతుకెంత, నీ చరిత్రంతా మాకు తెలుసు అని ముఖ్యమంత్రి అన్నారని, దాంతో మీ చరిత్ర మాకు తెలుసునని, ప్రజలకు కూడా తెలుసునని తాను అన్నానని ఆయన చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఇది బ్లాక్ డే అని, ఇంత అవమానాన్ని తాను ఎప్పుడు చవిచూడలేదని, ప్రజల కోసం ఇదంతా భరిస్తున్నానని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి హుందాతనాన్ని మరిచిపోయి వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు.

CLOSE    HOME

General News     Cinema News     International News     Sports News     Political News     Business News


Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.