|
|
టోలీచౌకీ ప్రాంత వాస్తవ్యుడు, రియల్టర్ అయిన ఖాజా ఎలియాస్ జాసుద్దీన్ ఎలియాస్ సల్మాన్ సోమవారం సాయంత్రం 4గంటల ప్రాంతంలో స్నేహితులు సయ్యద్ జావేద్, అబ్దుల్ కరీం , షయా దుల్లా లతో కలిసి ఇండికా కారులో అత్తాపూర్ హైదర్ గూడ చౌరస్తా దగ్గరలో ఉన్న మధురా బార్ కు వెళ్లాడు. రాత్రి 8గంటల సమయంలో సల్మాన్ బృందానికి మరో ఇద్దరు మిత్రులు వారికి తోడయ్యారు. 8.30గంటల సమయంలో పీకలదాకా తప్ప తాగి ఆ మత్తులో ఉన్న సల్మాన్ బార్ లోని టీవి వాల్యూమ్ పెంచాల్సిందిగా వెయిటర్ తో చెప్పాడు.బార్ సిబ్బంది వాల్యూమ్ పెంచారు.అయితే మద్యం సేవిస్తున్న మిగిలిన వారు దీనికి అభ్యంతరం చెప్పడం తో బార్ ఉద్యోగులు వాల్యూమ్ తగ్గించారు.దీంతో తన మాటను కాదన్నారన్న ఆవేశం లో ఒక్కసారిగా రెచ్చిపోయి సల్మాన్ నేను చెప్పిన తరువాత కూడా వాల్యూమ్ తగ్గిస్తారా? అంటూ తన లైసెన్స్డ్ పిస్టల్ ను బయటకు తీసి టీవి అమర్చి ఉన్న గోడను టార్గెట్ చేసుకుని కాల్పలు జరిపాడు.దాంతో మిగతావారు ప్రాణభయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. బార్ లో కౌంటర్ పై కూర్చుని ఉన్న రవి, ప్రవీణ్ రాజేంద్రనగర్ లు ఈ విషయాన్ని పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసి సమాచారం అందించారు. కానిస్టేబుల్ శివకుమార్, హోంగార్డు గోపీసింగ్ రాథోడ్ లు బార్ కు వచ్చారు. సల్మాన్ ను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు.కానీ,మన హీరో వారిపై కూడా తిరగబడటం తో ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్ రంగం లోకి దిగి లొంగిపోయి పిస్టల్ ను అప్పగించాలని హెచ్చరించినా పట్టించుకోలేదు. దాంతో ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్ నేలపై పడుకుని తన సర్వీస్ రివాల్వర్ తో సల్మాన్ తొడపై కాల్చారు.ఆ తరువాత సల్మాన్ ను అదుపులోకి తీసుకుని పిస్టల్ ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతన్ని స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ప్రాథమిక చికిత్స తరువాత ఉస్మానియా ఆస్పత్రికి మార్చారు. సల్మాన్ స్నేహితులు సయ్యద్ జావేద్, అబ్దుల్ కరీం, ఫయాదుల్లాను అదుపులోకి తీసుకున్నారు.మరో ఇద్దరు పారిపోయారు.
|
|