|
|
|
గోపికలు ఎంతమందైనా కృష్ణుడు ఒక్కడే కదా... అందుకే "ఒక్కమగాడు"గా వై.వి.ఎస్. చౌదరి చిత్రంలో నటిస్తోన్న నందమూరి బాలకృష్ణ ఆ చిత్రం గ్యాప్‌లో "రంగ పాండురంగ" చిత్రంలో నటిస్తున్నాడు. మాస్ మసాలాతో వస్తున్న సినిమా ఇదని సినీ వర్గాల విశ్వసనీయ సమాచారం. ఒకప్పుడు స్వర్గీయ ఎన్టీఆర్ నటించగా జనాదరణ పొందిన "పాండురంగ మహాత్య్మం" ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమాలో పాండురంగునిగా, పుండరీకాక్షునిగా రెండు పాత్రల్ని బాలకృష్ణ పోషిస్తున్నారు. ఇక జె.కె. భారవి స్క్రిప్ట్... "భైరవ ద్వీపం"తో పాటు కొన్ని జానపద చిత్రాల్ని చేసిన బాలకృష్ణకు ఈ చిత్రంలో చేయడం కొట్టిన పిండి లాంటిది. అక్టోబర్ మొదటివారంలో ఈ చిత్రం నాచారణలోని రామకృష్ణా స్టూడియోలో షూటింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం ఫిలింసిటీకి మారిన ఈ చిత్ర షూటింగ్‌లో కృష్ణుని గెటప్‌లో బాలకృష్ణ నటిస్తున్నారు. రుక్మిణిగా సుహాసిని, సత్యభామగా వేద నటిస్తుండగా మరో ఎనిమిదిమంది గోపికల మధ్య బాలకృష్ణ నటిస్తున్నారు. ఈ చిత్రంలో నారదునిగా ఎల్.బి. శ్రీరామ్ నటించడం విశేషం. ఈ నెల 30తో ఈ చిత్రం షెడ్యూల్ పూర్తయింది. తదుపరి షెడ్యూల్ మహారాష్ట్రలో డిసెంబర్‌లో జరుగనుంది. నవంబర్‌లో "ఒక్కమగాడు" చిత్రంలో పాల్గొననున్నందున డిసెంబరులో "పాండురంగ" షెడ్యూల్ జరపాల్సి వచ్చిందని యూనిట్ వర్గాల బోగట్టా.
|
|