|
|
 |
తన సినీకెరీర్‌లో 75వ చిత్రంగా రూపొందుతోన్న "స్వాగతం" చిత్రాన్ని ఛాలెంజ్‌గా స్వీకరించానని నటుడు జగపతిబాబు చెప్పాడు. ఇంతకుముందు మూడు చిత్రాలు హిట్ అయినా ఈ చిత్రమూ హిట్ అవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. భూమిక, అనుష్క హీరోహీరోయిన్లుగా దశరథ్ దర్శకత్వంలో ఆదిత్యారాం నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి చేసుకుని అమెరికా వెళ్తున్న సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో జగపతిబాబు మాట్లాడుతూ... కథ, స్క్రీన్‌ప్లే నచ్చి తానే నిర్మాత ఆదిత్యారాంతో కలిసి ఈ సినిమా చేయాలని అడిగానని, ఇందుకు ఆదిత్యారాం వెంటనే అంగీకరించారని వెల్లడించారు. ఈ చిత్ర కథ న్యూయార్క్‌లో ప్రారంభమై రాజమండ్రి, హైదరాబాద్‌లో ప్రయాణిస్తూ చివరికి మళ్ళీ యు.ఎస్ వెళుతుందని అన్నారు. చిత్ర సంగీత దర్శకుడు ఆర్.పి. పట్నాయక్ వ్యాఖ్యానిస్తూ... కథకు సంబంధించిన కీలక సన్నివేశాలను యు.ఎస్‌లో చిత్రీకరించబోతున్నారని వెల్లడించారు. ఇప్పటికే పాటల రికార్డింగ్ పూర్తయిందని, సంగీతం చక్కగా కుదిరిందని అన్నారు. శ్రోతల నుంచి సంగీతానికి మంచి స్పందన ఉంటుందని పట్నాయక్ ఆశాభావం వ్యక్తం చేశారు. దర్శకుడు మాట్లాడుతూ.. ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తయిందని అన్నారు, మరోవైపు ఎడిటింగ్ కార్యక్రమాలూ జరుగుతున్నాయి. హీరోగానేకాకుండా నిర్మాతగా జగపతిబాబు చక్కని పేరు సంపాదించారని ఆయన కొనియాడారు. ఇందులో ఫ్లాష్‌బ్లాక్‌లో వచ్చే పాత్రకు ఆయన వన్నెతెచ్చారని చెప్పారు. ఈ చిత్రాన్ని డిసెంబరులో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నామని తెలిపారు. తాను ఈ మధ్యనే షూటింగ్‌లో పాల్గొన్నానని, ఓ మంచి పాత్ర పోషిస్తున్నానని హీరోయిన్ అనుష్క చెప్పింది. ఇంకా ఈ చిత్రంలో ఆషాశైని, సుధ, రాజారవీంద్ర, బ్రహ్మానందం, శరత్‌బాబు, సునీల్, ధర్మవరపు, రఘుబాబు, ఝాన్సీ, బేబియాని, బేబి శివాని, మాస్టర్ రోషన్ తదితరులు నటిస్తున్నారు. కెమెరా: రమేశ్ బాబు, కళ: నాగేంద్ర, స్క్రీన్ ప్లే: గోపీమోహన్, ప్రాజెక్ట్ కో - ఆర్టినేటర్: భగీరథ, కథ, మాటలు, దర్శకత్వం: దశరథ్.
|
|