|
|
 |
వేణుమాధవ్ హీరోగా నటిస్తోన్న ప్రేమాభిషేకం చిత్రం షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. శాలువ వేసుకున్న వేణుమాధవ్‌పై ముహూర్తపు షాట్ చిత్రీకరించారు. దీనికి దాసరి నారాయణరావు క్లాప్ కొట్టగా... లగడపాటి శ్రీధర్ స్విచ్చాన్ చేశారు. వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా వేణుమాధవ్ దాసరి చిత్రకథను ఇచ్చిన అంశాల్ని చెప్పుకొచ్చాడు... ఒకరోజు సరదాగా "స్టేట్‌రౌడీ" సినిమా ఆఫీసులో కూర్చుని హీరో శివాజీ, దర్శకుడు గాంధీ...నేను మాటల్లోపడ్డాం. రాజావన్నెంరెడ్డి చిత్రం "ఆదివారం ఆడవాళ్ళకు సెలవు" చిత్రం గురించి టాపిక్ వచ్చింది. ఈ చిత్రానికి డా. దాసరి నారాయణరావుగారు కథనివ్వడంతో మంచి హిట్ అయింది. అలాగే మరో ఇద్దరికి ఆయన కథలు ఇచ్చారని మాటల్లో తెలిసింది. అందరికీ గురువుగారు కథలిస్తారు. మరి నాకెందుకివ్వరూ? అని అన్నాను. వెంటనే శివాజీ అందుకుని... నువ్వెళ్ళి అడిగితే "ప్రేమాభిషేకం" వంటి కథ ఇస్తారని అన్నాడు. అయితే ఇప్పుడే వెళతానని... వెళ్ళి కలిశాను. ఆరోజు ఆయన ఇంటిలోనే ఉన్నారు. అక్కడే అమ్మ (దాసరి పద్మ) కూడా ఉన్నారు. గురువుగారికి విషయం చెప్పి నాలాంటి వాడిక్కూడా ఓ కథ దానం చేయండన్నాను. ఆయన నవ్వి... ఆలోచిస్తానని అన్నారు. మీరు మాట ఇవ్వకపోతే నేనిక్కడే ఉంటానని చెప్పాను. ఆ తర్వాత... ఆయన నవ్వి... నీకు ఎలాంటి కథ కావాలి? అని అడిగారు. నేను సడెన్‌గా తెలివీ ధైర్యంతో "ప్రేమాభిషేకం" లాంటి కథకావాలన్నాను. ఆ మాటకు మా అమ్మ దాసరి (పద్మ) కూడా వత్తాసు పలకడంతో తప్పకుండా ఇస్తాలే అని దాసరి అనడం... ఇక నేను తిరిగి వచ్చేయడం జరిగింది. కొద్దిరోజులకు అర్థరాత్రి 11 గంటలకు లాండ్‌ఫోన్ వచ్చింది. ఈ టైమ్‌లో ఎవరబ్బా? అని రిసీవ్ చేశాను. దాసరి ఇంటి నుంచి మాట్లాడుతున్నాం. ఒక్కసారి ఇంటికి వస్తారా? అన్నది సారాంశం. తెల్లవారి వెళ్ళి కలిశా... మంచి కథ దొరికింది... నువ్వన్నట్లు టైటిల్‌కూడా "ప్రేమాభిషేకం". కానీ "వీడికి క్యాన్సర్ లేదు" అనేది కాప్షన్ అని చెప్పారు. నాకు ఎంతో ఆనందం వేసింది. ఎప్పుడో అడిగిన కథను ఇలా కొద్దిరోజులకే ఇస్తారను కోలేదని... ఆయనకు జన్మాంతం రుణపడి ఉంటానని వేణు వెల్లడించాడు.
|
|