|
|
దేశంలో చమురు ధరలపై వచ్చే వారంలో కేంద్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంటుందని పెట్రోలియం శాఖ మంత్రి మురళీ డియోరా చెప్పారు. ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌తో ఈ విషయంపై డియోరా శుక్రవారం చర్చలు జరిపారు. ఈ సమావేశం అనంతరం మురళీ డియోరా విలేకరులతో మాట్లాడుతూ చమురు ధరలపై వచ్చే వారంలో కేంద్రం నిర్ణయం తీసుకోనుందని తెలిపారు. పెట్రోల్, డీజిల్‌పై ధరలను నామమాత్రంగా పెంచే ప్రతిపాదనలను కేంద్ర పరిశీలించే అవకాశం ఉందన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు 100 అమెరికన్ డాలర్ల (బ్యారెల్)కు చేరువగా ఉండడంతో దేశంలోని ప్రభుత్వ రంగ చమురు సంస్థలు భారీగా నష్టపోతున్నాయి. వచ్చే వారంలో దీనిపై సమావేశం జరగనున్న కారణంగా దీనిపై పూర్తి స్థాయిలో తాను ప్రధానితో చర్చించలేదని డియోరా చెప్పారు. వచ్చే రెండు మూడు రోజుల్లో చమురు ధరలపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ధరలు పెరిగే అవకాశాలపై తానేమీ మాట్లాడబోనని చెప్పిన డియోరా ధరలు పెరగకుండా ఉంటాయనే దానిపై ఏమీ చెప్పలేనన్నారు.
|
|