|
|
|
జీకే ఫిలింస్ కార్పరేషన్ పతాకంపై విశాల్, ప్రియమణి హీరోహీరోయిన్లుగా నటించిన భయ్యా చిత్రానికి భూపతి పాండ్యన్ దర్శకత్వం వహించారు. విక్రమ్ కృష్ణ నిర్మాణ సారథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ ఇచ్చాడు. విశాల్‌ను మాస్ పరంగా ఎన్ని కోణాలలో చూపించవచ్చో అన్ని కోణాల్లో ఈ చిత్రంలో చూపించారు.
కథలోకి వెళ్తే.... ఒక సిన్సియర్ అధికారిని మల్లన్న అనే గూండా నడిరోడ్డులో హత్యచేస్తాడు. ఆ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తుందని తెలుసుకుని మల్లన్న విదేశాలకు వెళతాడు. తమ్ముడు అజయ్ మాత్రం అదే ఊళ్లో గూండాగిరిని కొనసాగిస్తుంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు తన స్నేహితున్ని కలవడానికి వచ్చిన జగన్ (విశాల్) అక్కడ కొందరు రౌడీలకు బుద్ధి చెప్పగా, ఆ గొడవ పోలీసు కేసయి కోర్టుకు చేరుతుంది. అనంతరం బెయిల్ తీసుకుని అతని చిన్నాన్న వెంకటస్వామి ఇంటిలో ఉంటూ రోజు పోలీస్ స్టేషన్‌లో సంతకం పెట్టి వస్తుంటాడు హీరో జగన్.
చిన్నాన్న ఇంటికి వస్తున్నప్పుడే కాకులకు అన్నం పెడుతూ సాంప్రదాయ దుస్తులలో కనపడ్డ అమ్మాయి మాలతి (ప్రియమణి)ని చూసి జగన్ ప్రేమలో పడతాడు. ఇదే విషయాన్ని మాలతికి చెప్పగా జగన్ ప్రేమను తిరిస్కరిస్తుంది. ఓ సమయంలో జగన్ నుంచి తప్పించుకోవడానికి మల్లన్న తమ్ముడు మణిని తన ప్రియుడని అని అబద్ధం చెబుతుంది. అది విన్న మణి మాలతిని హింసిస్తాడు. ఈ క్రమంలో మణిని జగన్ చావగొట్టగా విషయం తెలుసుకున్న మల్లన్న హీరోను చంపుతానని శబధం చేస్తాడు.
దీని తర్వాత ఏం జరుగింది?.. మాలతి ఏమవుతుంది..? అనే దానిపై కథ సాగుతుంది. పందెం కోడి, పొగరు చిత్రాలలో ప్రేక్షకులను ఆకట్టుకున్న విశాల్ ఈ చిత్రంలోనూ కామెడీ మాస్‌తో ప్రత్యేక శైలిని కనబరిచాడు. ఇంకా విశాల్ చిన్నాన్న పాత్రలో నటించిన ఆశిష్‌విద్యార్థి, ఊర్వశిల ప్రేమ కలాపాలు గతంలోని వారి చిలిపి సంగతులు వీక్షకులను కడుపుబ్బ నవ్విస్తాయి. పొన్నాంబళం కామెడి సక్సెస్. సినిమా మొత్తం కామెడీతో పాటు విలన్‌ను బోల్తా కొట్టించే విషయంలో హీరో చూపించే చాకచక్యాన్ని బాగా చిత్రీకరించారు.
ఇంకా మణిశర్మ అందించిన పాటలు బాగున్నాయి. ఫైట్స్ కణల్‌కణ్ణన్ విశాల్‌ను బాగా కష్టపెట్టినట్లున్నాడు. ఇంకా ఈ చిత్రంలో అజయ్, ఊర్వశి, దేవరాజ్ తదితరులు నటించారు. అలాగే డైలాగ్స్ శశాంక్ వెన్నెలకంటి బాగా ఇచ్చాడు.
|
|